AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంబర్‌పేట ఘటన మరువకముందే మరో దారుణం..

మరో బాలుడిపై వీధి కుక్కల దాడి

హైదరాబాద్‌: అంబర్‌పేటలో వీధి కుక్కల దాడికి బలైన ప్రదీప్‌ ఘటన మరువకముందే నగరంలో మరో దారుణం చోటుచేసుకుంది. చైతన్యపురిలో రిషి అనే బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం రిషికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే కరీంనగర్‌ జిల్లాలో హాస్టల్‌కి చొరబడి ఓ విద్యార్థిని వీధి కుక్క గాయపర్చింది.

నగరంలోని చైతన్యపురిలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో బాలుడు రుషికి స్వల్ప గాయాలవ్వగా.. కుటుంబసభ్యులు గమనించి వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాలుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

అలాగే కరీంనగర్‌ జిల్లాలోని శంకరపట్నం ఎస్సీ హాస్టల్‌లో దారుణం చోటుచేసుకుంది. హాస్టల్‌లోకి చొరబడి 7వ తరగతి విద్యార్థి సుమంత్‌ను వీధి కుక్క గాయపర్చింది. ఈ దాడిలో బాలుడికి తీవ్ర గాయాలవ్వగా.. హాస్టల్‌ సిబ్బంది సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుక్కల దాడిలో మతి చెందిన అంబర్‌పేటకు చెందిన ప్రదీప్‌ ఘటన కలిచివేస్తోంది. ఈ ఘటన మరువకముందే రాష్ట్రంలో మరో ఇద్దరు చిన్నారులు వీధి కుక్కల దాడి బారిన పడటం తల్లిదండ్రులను ఆందోళన కల్గిస్తోంది.

అంబర్‌పేటలో బాలుడి ప్రదీప్‌పై వీధి కుక్కలు దాడి చేసిన సీసీ టీవీ దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. అభం, శుభం తెలియని వయస్సులో బాలుడు కుక్కలకు బలైపోవడంతో తల్లిదండ్రులు రోదిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు దీనిపై స్పందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి జీహెచ్‌ఎంసీ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. కుక్కల బెడద, నివారణపై సమీక్షించారు.

అంబర్‌పేట ఘటనపై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందటంతో.. దీనిపై చర్యలు చేపడుతున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కూడా రేపు మసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో వీధి కుక్కల నివారణపై అధికారులతో చర్చించనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10