ఊయలలో పడుకోబెట్టిన చిన్నారి కాలివేలును కోతులు కొరికేసిన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని విరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ భార్యభర్తలు. వీరికి నెలన్నర పాప ఉంది. లావణ్య మోదుగలగూడెంలోని తన పుట్టింటికి పోయింది. అక్కడ ఇంట్లో వాళ్లు చిన్నారిని ఊయలలో పడుకోబెట్టి నీళ్లకోసం వెళ్లారు.
కోతులు అకస్మాత్తుగా ఊయల వద్దకు చేరుకుని చిన్నారిపై దాడి చేశాయి. పసికందు వేలును కొరికేశాయి. దీంతో చిన్నారి పెద్ద పెట్టున ఏడవడంతో అప్రమత్తమైన ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని కోతులను తరిమికొట్టారు. అనంతరం చిన్నారిని చికిత్స నిమిత్తం మహబూబాబాద్ సర్కార్ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం పసికందును వరంగల్‌కు తరలించినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. నగరంలో తాజాగా నాలుగేళ్ల చిన్నారిపై కుక్కలు దాడి చేసిన సంఘటన తెలిసిందే.