వేడుకల్లో అపశృతి
పేలిన గ్యాస్ బెలూన్లు
హైదరాబాద్: సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు గ్యాస్ బెలూన్లపై పడటంతో అవి పేలాయి. దీంతో భయకంపితులై అందరు పరుగులు తీశారు. కాచిగూడలో జరిగిన కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టపాసులు పేలుస్తుండగా నిప్పురవ్వలు గ్యాస్‌బెలూన్లపై పడి బెలూన్లు పేలాయి. ఈ ఘటనతో పరిగెత్తుతుండగా ఎమ్మెల్యే కిందపడ్డారు. ఆయనతో పాటు కార్యకర్తలు కూడా కిందపడ్డారు.
ఈ ఘటనలో ఎమ్మెల్యే వెంకటేశ్‌తో పాటు కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే పరిగెత్తడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఆనందోత్సహాల మధ్య జరగాల్సిన కేసీఆర్ బర్త్ డే వేడుకలు గందరగోళంగా మారాయి. ఎమ్మెల్యే గ్యాస్ బెలూన్లు గాలిలో వదిలేస్తుండగా.. అదే సమయంలో కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. బాణాసంచాల నుంచి వచ్చిన నిప్పు రవ్వలు గ్యాస్ బెలూన్‌పై పడటంతో గ్యాస్ బెలూన్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో భయభ్రాంతులకు గురైన ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్, కార్యకర్తలు అక్కడి నుంచి పరుగో పరుగు అంటూ లగాయించారు.