పాపులర్ షార్ట్ వీడియో ప్లాట్‍ఫామ్ టిక్‍టాక్ (TikTok) విషయంలో అమెరికాలో కీలక పరిణామాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చైనీస్ షార్ట్ వీడియో ప్లాట్‍ఫామ్‍ను నిషేధించే దిశగా అడుగులు పడుతున్నాయని సమాచారం. నిషేధం విషయంలో భారత్‍ను అమెరికా ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో టిక్‍టాక్‍ను బ్యాన్ చేయాలంటూ హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ (House of Foreign Affairs Comittee) వచ్చే నెలలో ఓటింగ్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఆ కమిటీ కూడా ధ్రువీకరించింది. అసలు టిక్‍టాక్‍ను బ్యాన్ చేయాలని అమెరికా ఎందుకు అనుకుంటోందంటే.. కారణమిదే.. TikTok Ban: బైట్‍డ్యాన్స్ కంపెనీకి చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‍టాక్‍పై మొదటి నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి. వేరే దేశాల యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి చేరవేస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది. ఈ విషయంలోనే అమెరికా కూడా ఆందోళన చెందుతోంది. టిక్‍టాక్ వాడుతున్న అమెరికన్ల డేటా చైనా సర్వర్లకు చేరుతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాలోనూ టిక్‍టాక్ బ్యాన్ చేయాలనే డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. సెనేటర్ డాష్ హాలే, అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి కెన్ బక్.. టిక్‍టాక్‍ను దేశవ్యాప్తంగా నిషేధించాలని ఇటీవల ఓ బిల్లును ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ గత సెషన్‍లోనూ ఇలాంటి బిల్లు వచ్చినా.. పరిగణనలోకి తీసుకోలేదు. ఇప్పటికే..
TikTok Ban: టిక్‍టాక్‍ను బ్యాన్ చేసేందుకు అమెరికాలో గతంలోనూ ప్రయత్నాలు జరిగాయి. అమెరికాలో కొత్త యూజర్లు టిక్‍టాక్‍ను డౌన్‍లోడ్ చేసుకోకుండా 2020లో ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ నిర్ణయాన్ని అప్పట్లో అమెరికా సుప్రీం కోర్టు నిలిపివేసింది. తాము పంపిణీ చేసిన ఫోన్‍లలో టిక్‍టాక్‍ను అమెరికా ప్రతినిధుల సభ.. గత నెలలో బ్యాన్ చేసింది. అలాగే సిబ్బంది కూడా అన్ని ఫోన్‍లలో టిక్‍టాక్‍ను డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ డివైజ్‍ల్లో టిక్‍టాక్‍ను ఇప్పటి వరకు అమెరికాలోని 20 ప్రభుత్వాలు నిషేధించాయి. అలాగే ఫెడరల్ ఉద్యోగులు టిక్‍టాక్ వినియోగించకుండా ఆదేశాలు జారీ చేశారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. మరోవైపు టిక్‍టాక్‍పై అమెరికాలో నిషేధం వేటు పడకుండా బైట్‍డ్యాన్స్ చర్యలకు దిగింది. అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్‍తో చర్చలు జరుపుతోంది. అమెరికా యూజర్ల డేటా చైనా సర్వర్లకు చేరకుండా చర్యలు చేపడతామని గతేడాదిలోనే టిక్‍టాక్ ప్రకటించింది. ప్రస్తుతం టిక్‍టాక్‍కు అమెరికా అతిపెద్ద మార్కెట్‍గా ఉంది. భారత్‍లో నిషేధం 2020లో షార్ట్ వీడియో ప్లాట్‍ఫామ్ టిక్‍టాక్‍ను భారత ప్రభుత్వం నిషేధించింది. దీంతోపాటు చైనాకు చెందిన మరో సుమారు 100 యాప్‍లను బ్యాన్ చేసింది. భారత యూజర్ల డేటాను టిక్‍టాక్ చైనా సర్వర్లకు చేరవేస్తోందని, ఇది దేశ భద్రతకే ముప్పు అని ఆ యాప్‍ను నిషేధించింది. బ్యాన్ చేసే నాటికి టిక్‍టాక్‍కు భారత్‍లో 20 కోట్ల మందికి పైగా యూజర్లు ఉండేవారు.