తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారట. స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. దానికి కారణం ఏంటి.. అసలు ఎర్రబెల్లిపై ఎందుకు సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు అనేది తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో తీవ్రంగా చర్చనీయాంశం అవుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 25 మందిపై తీవ్రంగా వ్యతిరేకత ఉందని.. వాళ్లను మార్చాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి దయాకర్ రావు ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణలో వైరల్ అయ్యాయి. రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలను మార్చేస్తే.. వేరే వాళ్లకు సీటు ఇస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గ్యారెంటీ అంటూ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు.
ఒకవేళ ఎమ్మెల్యేలను మార్చకపోతే మాత్రం బీఆర్ఎస్ కు 90 సీట్ల వరకే వచ్చే అవకాశం ఉందని ఆయన జోస్యం చెప్పారు. ప్రజల్లో సీఎం కేసీఆర్ కు నమ్మకం ఉంది కానీ.. కొంతమంది ఎమ్మెల్యేల మీద మాత్రం వ్యతిరేకత ఉంది. నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదు. నేను వ్యక్తిగతంగా సర్వేలు చేయిస్తున్నా. ఆ సర్వేలలో వచ్చిన ఫలితాల ఆధారంగానే వివరాలు చెబుతున్నా.. అంటూ మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు.. అంటూ ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఈ వ్యవహారం.. కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో ఆయన.. ఎర్రబెల్లిపై సీరియస్ అయ్యారట. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, కాస్త అత్యుత్సాహం తగ్గించుకోవాలని ఫోన్ లో కేసీఆర్.. ఎర్రబెల్లికి క్లాస్ పీకారట. ఇంకోసారి ఇలా మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఎర్రబెల్లిని హెచ్చరించినట్టు తెలుస్తోంది.