నగరంలో ఈ మధ్య రోజూ ఎక్కడో ఒక చోట అగ్ని ప్రమాదం చోటుచేసుకుంటోంది. వరుస అగ్ని ప్రమాదాలతో ప్రజలు కలవరం పడుతున్నారు. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా.. మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. వేగంగా వ్యాపిచండంతో గోదాం మొత్తం కాలి బూడిదైంది.
మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తుండగా… ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గత నెల సికింద్రాబాద్ దక్కన్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. భారీగా ఎగిసి పడిన మంటలు, పొగతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు చిక్కుకోగా.. ఒకరి అస్థిపంజరం దొరికింది. మరో ఇద్దరి ఆచూకీ లభించలేదు. అగ్ని ప్రమాద ఘటనలో బిల్డింగ్ మ్నెత్తం దెబ్బతినటంతో అధికారులు దాన్ని కూల్చివేశారు.
రెండ్రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఎస్‌టీలోని అన్నపూర్ణ బార్ సమీపంలోని ఓ గోదాంలోనూ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో పరిసర ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించడంతో చీకటిమయంగా మారాయి. ఒక్కసారిగా మంటలు రావడం, పొగ వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మంటలు రావడంలో స్థానిక గోడౌన్‌కు సమీపంలోని ప్రజలు పరుగులు తీశారు.
నిన్న నూతన సెక్రటేరియట్‌లోనూ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారు జామున ఉన్నట్లుండి మంటలు వ్యాపిచటంతో అధికారులు పరుగులు తీశారు. 11 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఈనెల 17న సెక్రటేరియట్ ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా.. ఇంతలోనే అగ్ని ప్రమాదం చోటు చేసుకోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘనటపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హడావుడిగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయటంతో ఇలాంటి ప్రమాదం చోటు చేసుకుందని ఆరోపిస్తున్నారు.