ప్రముఖ తమిళ నటుడు ప్రభు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయన్ని వెంటనే చెన్నైలోని కొడంబక్కంలోని మెడ్వే ఆసుపత్రికి తరలించారు. ఈ నటుడు గత కొంతకాలంగా కిడ్నీలోకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ తరుణంలోనే మంగళవారం రాత్రి తీవ్రంగా అనారోగ్యం పాలవ్వడంతో ఆయన్ని హాస్పిటల్‌లో చేర్పించారు.
ప్రభు ఆరోగ్యం గురించి వివరిస్తూ మేడ్వే యాజమాన్యం ఓ నోట్‌ని విడుదల చేసింది. అందులో.. నటుడికి కిడ్ని లో రాళ్లు ఉండగా.. యురేత్రోస్కోపీ లేజర్ సర్జరీ ద్వారా కిడ్నీలోని రాళ్లను తొలగించినట్లు వైద్యులు తెలిపారు. అయితే.. ప్రభు ఆర్యోగం నిలకడగా ఉందని, ఒకటి లేదా రెండు రోజుల్లో ఆయన్ని డిశ్చార్జీ చేయనున్నట్లు అందులో పేర్కొన్నారు.
అయితే.. ప్రభు తమిళ నటుడైనప్పటికీ ‘చంద్రముఖి’, ‘డార్లింగ్’, ‘శక్తి’ చిత్రాల్లో నటించి తెలుగులోనూ గుర్తింపు పొందారు. ముఖ్యంగా ‘డార్లింగ్’ చిత్రంలో ప్రభాస్‌కి తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యారు. అలాగే ఆయన ఇటీవలే దళపతి విజయ్ ‘వారసుడు’ చిత్రంలో కనిపించారు.