ప్రభుత్వం ఆధ్వర్యంలో మటన్ క్యాంటీన్లు
హైదరాబాద్: మీరు నాన్‌వెజ్ ప్రియులా ? అయితే మీకో గుడ్ న్యూస్. త్వరలో హైదరాబాద్‌లో ప్రభుత్వం మటన్ క్యాంటీన్లను తెరవనుంది. వెరైటీ మటన్ వంటకాలతో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నాయి. వచ్చే నెలలో క్యాంటీన్లు ప్రారంభం కానుండగా.. స్టేట్ షిప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వీటిని నడపనున్నారు. తెలంగాణ సర్కార్ త్వరలో మటన్ క్యాంటీన్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడిరచింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం ద్వారా మాంసం ఉత్పత్తులు పెరిగాయి. దీంతో మాంసం ఉత్పత్తులను ప్రజలకు చేరువచేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మటన్ క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.
ఈ మటన్ క్యాంటీన్లలో మటన్ బిర్యానీతో పాటు గుర్దా ఫ్రై, పాయ, కీమా, పత్తార్ కా గోస్ట్ వంటి రుచికరమైన వంటకాలు ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు. రాష్ట్రంలో మొదటి క్యాంటీన్‌ను కో ఆపరేటివ్ ఫెడరేషన్ కార్యాలయం ఉన్న హైదరాబాద్ శాంతినగర్ కాలనీలో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్యాంటీన్ వచ్చే నెలలో (మార్చి)లో ప్రారంభం కానుంది. మటన్ క్యాంటీన్లలో మెనూ ధరలు ఇంకా ఖారారు కాలేదు. అయితే వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలకే మటన్ వంటకాలను విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
తొలి దశలో జీహెచ్‌ఎంసీ పరిధిలో మటన్ క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఇటీవల నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీతో భేటీ అయ్యారు. మటన్ క్యాంటీన్ల నిర్వహణకు జీహెచ్‌ఎంసీ నుంచి సహకారం అందించాలని కోరారు.