నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులోని పంట పొలాల్లో ఓ భారీ బెలూన్ , దానికి అమర్చిన పరికారాలు స్థానికంగా కలకలం రేపాయి. ఓ భారీ బెలూన్, దానికి అమర్చిన వింత పరికారాలు, తర్నికల్ శివారులో, మరికొన్ని ఊర్కొండ మండల శివారులోని పంట పొలాల్లో పడిపోయాయి. వాటిని చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా అక్కడి చేరుకున్నారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి ? ఎవరు పంపించి ఉంటారు? అనే ప్రశ్నలతో స్థానికులు ఆందోళనలకు గురయ్యారు. వెంటనే విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు.
కల్వకుర్తి సీఐ సైదులు అక్కడికి చేరుకొని బెలూన్ భారత పరిశోధన సంస్థకు చెందినదిగా గుర్తించారు. వెంటనే ఆ విషయాన్ని వారికి చేరవేశారు. ఆ ప్రాంతానికి ఎవరు వెళ్లకుండా చూడాలని సంబంధిత అధికారులు పోలీసులకు సూచించారు. ఆదివారం సాయంత్రం టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ సెంటర్ పరిశోధకులు అక్కడికి చేరుకున్నారు. వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు దీన్ని ప్రయోగించినట్లు వారు తెలిపారు. రీసెర్చ్ సెంటర్ సిబ్బంది బెలూన్‌ను హైదరాబాద్‌కు తరలించారు.