AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పసికందుతో సహా భార్యను చంపిన భర్త..

మానవత్వం మంటగలుస్తోంది. క్షణికావేశంలో రక్త సంబంధాలను సైతం మరిచిపోతున్నారు. ప్రాణం కన్న మిన్నగా చూసుకోవల్సిన వారి ప్రాణాలనే తీస్తున్నారు. తాజాగా హైదరాబాద్ శివారులో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తాళి కట్టిన భర్తనే కాలయముడయ్యాడు. భార్యతో పాటు నెల రోజుల చిన్నారిని సైతం చిదిమేశాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం అనాజ్ పూర్ గ్రామంలో బుధవారం ఈ దారుణం చోటు చేసుకుంది. భార్య లావణ్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం నెల రోజుల కుమారుడిని నీటి సంపులో వేసి హతమార్చాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనాజ్‌పూర్ గ్రామానికి చెందిన ఏర్పుల ధన్‌రాజ్‌‌తో.. బండరావిరాలకు చెందిన లావణ్య నాలుగు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండున్నర సంవత్సరాల పాప ఉండగా.. గత నెల రోజుల క్రితం బాబు పుట్టాడు. నెల రోజుల బాలింత అయిన లావణ్యను పుట్టింటి నుంచి బుధవారం రోజు తీసుకుని వచ్చాడు ధన్‌రాజ్. అదే రోజు భార్యను గొడలితో నరికి.. నెల రోజుల బాబును నీటి సంపులో వేసి కర్కశత్వాన్ని చాటుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందుతుడు ధన్‌రాజ్ అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10