చిత్ర పరిశ్రమ ఈ రెండు నెలల కాలంలో పలువురు ప్రముఖులను కోల్పోయింది. ఇదే నెలలో కళాతపస్వి విశ్వనాథ్‌తో పాటు నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. ఈ సంఘటనలు మరవకముందే మలయాళ నటి, టీవీ యాంకర్ సుబీ సురేష్ బుధవారం (ఫిబ్రవరి 22న) మరణించింది. ఆమె వయసు 42 ఏళ్లు కాగా.. కొద్ది రోజుల నుంచి కాలేయ సంబంధిత వ్యాధితో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. జనవరి 28న సుబీని అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చేర్చగా.. కామెర్లు ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని, ఊపిరితిత్తులు బలహీనంగా ఉన్నందున చికిత్స కష్టంగా ఉందని అంతకుముందు ఆమె సన్నిహితురాలు చెప్పారు.
సుబీ సురేష్ చాలా ఏళ్ల కిందట ఏసియానెట్‌లో ప్రసారమైన ‘సినీమాల’ అనే కామెడీ ప్రోగ్రామ్ ద్వారా ఈ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టింది. మిమిక్రీతో పాటు తనదైన కామెడీతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలోనే ‘కనకసింహాసనం, కార్యస్థానం, హ్యాపీ హస్బెండ్స్, ఎల్సమ్మ ఎన్న ఆంకుట్టి, పచ్చకుతీర తదితర మలయాళ చిత్రాల్లో నటించింది. అలాగే ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్’, ‘కుట్టి పట్టాలం’ వంటి షోస్ హోస్టింగ్ తనకు మంచి పేరు తీసుకొచ్చాయి.
సుభీ సురేష్ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంతాపం తెలిపారు. ‘కొచ్చిన్ కళా భవన్ ద్వారా కళారంగంలోకి ప్రవేశించిన సుబీ. రియాల్టీ షోస్, కామెడీ ప్రోగ్రామ్స్ ద్వారా మలయాళీల హృదయాల్లో స్థానం సంపాదించుకుంది. సుబీ మృతితో ఒక మంచి ఆర్టిస్ట్‌ను కోల్పోయాం’ అని సీఎం పేర్కొన్నారు.