హైదరాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల రద్దీ కారణంగా తాజాగా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి దర్భంగా, గోరఖ్ పూర్, జైపూర్, యశ్వంత్ పూర్ ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లను తిప్పనుంది. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రత్యేక రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
సికింద్రాబాద్-దర్భంగా(07046/07047) ట్రైన్ సర్వీస్ మార్చి 9వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉండనుంది. ప్రతి గురువారం, ఆదివారం ఈ ప్రత్యేక ట్రైన్ తిరగనుంది. ఇక హైదరాబాద్-గోరఖ్‌పూర్(02575/02576) ప్రత్యేక రైలు మార్చి 3 నుంచి జులై 2 వరకు ప్రతి శుక్రవారం, ఆదివారాల్లో రాకపోకలు సాగించనుంది. అలాగే హైదరాబాద్-జైపూర్(07115/07116) ట్రైన్ మార్చి 3 నుంచి జులై 2 వరకు ప్రతి శుక్రవారం, శనివారాల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది.
ఇక హైదరాబాద్-యశ్వంత్‌పూర్(07265/07266) ప్రత్యేక రైలు మార్చి 7వ తేదీ నుంచి మార్చి 29 వరకు తిరగనుంది. ప్రతి మంగళ, బుధవారం ఈ ట్రైన్ సర్వీసులు అందించనుందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడిరచింది. ప్రయాణికులు ఈ ప్రత్యేక ట్రైన్లను వినియోగించుకోవాలని అధికారులు కోరారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది. అయితే పండుగలు, వేసవి సెలవుల సమయంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను తిప్పుతూ ఉంటుంది. అందులో భాగంగా ఈ ప్రత్యేక రైళ్లను ప్రకటించినట్లు తెలుస్తోంది.