కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ మొదటి సంవత్సరం (అనస్థీషియా) విద్యార్థిని ధారావత్ ప్రీతి సోదరి పూజ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన సోదరి మృతిపై అనేక అనుమానాలున్నాయని తెలిపింది. గిరిజన తెగకు చెందిందనే అందరూ కలిసి తన చెల్లిని ఒంటరి చేశారని పేర్కొంది. ఏకంగా అందరూ వాట్సప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని తన చెల్లిపై చర్చించుకునేవారని తెలిపింది. తోటి పీజీలు, సీనియర్లు అంతా ఒక్కటై తన చెల్లిని వేధించారని పేర్కొంది. విషయంపై హెచ్‌ఓడీ, ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిపింది. పోలీసుల విచారణ మధ్యలో ఎందుకు ఆపాల్సి వచ్చిందని ప్రశ్నించింది. నిజా నిజాలు నిగ్గుతేలాలని ప్రీతి సోదరి పూజ డిమాండ్ చేసింది.
ప్రీతి తండ్రి నరేందర్ సైతం నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హెచ్‌ఓడీని సైతం సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. సస్పెండ్ చేస్తేనే ప్రీతి ఆత్మకు శాంతి చేకూరుతుందని తెలిపారు. సైఫే తన కూతురికి ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడని చెబుతున్నారు. ఇక ప్రీతి మృతదేహాన్ని నేటి తెల్లవారుజామున ఆమె స్వగ్రామం జనగామ జిల్లా కొడగండ్ల మండలం..మొండ్రాయి గిర్నితండాకి తరలించారు. మరికాసేపట్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీతి మృతితో ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి.