ఈ విషయంపై కేంద్రానికి లేఖ రాయలేదా
బహిరంగ చర్చకు సిద్ధమా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
హైదరాబాద్ : తెలంగాణలో వ్యవసాయ బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెడతామని, మాకు రుణం ఇవ్వాలంటూ కేసీఆర్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూ లేఖ రాసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ విషయంపై కేసీఆర్ చర్చకు సిద్ధమా ? అని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైరయ్యారు. కమలాపూర్‌లోని ఈటల రాజేందర్ నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి తెలంగాణలో అధికారంలోకి వస్తే వాళ్ల కుటుంబానికి ప్రజలు బానిసల్లాగా బతకాల్సివస్తుందన్నారు. పోలీసులు బీఆర్‌ఎస్ పార్టీకి తొత్తులుగా మారారని.. సీఎం కుమారుడు, కూతురు, అల్లుడితో పాటు చివరకి ఆయన చుట్టాలు రాష్ట్రంలో ఎక్కడైనా పర్యటిస్తే మూడు రోజుల ముందే ప్రతిపక్ష నేతలను అరెస్టు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో ఈటల పరామర్శ సందర్భంగా బీఆర్‌ఎస్ గుండాలు దాడికి పాల్పడ్డారని సంజయ్ మండిపడ్డారు. ఈ కేసులో అరెస్టై పరకాల సబ్‌జైలు నుంచి విడుదలైన భాజపా నేతలను ఆయన పరామర్శించారు. పంగిడిపల్లిలో బీఆర్‌ఎస్ ఆరాచకాలను రాష్ట్రం మెుత్తం చూసిందని సంజయ్ అన్నారు. పంగిడిపల్లి ఘటనలో దాడి చేసిన వారిని వదిలిపెట్టి.. కాపాడిన వారిపై పోలీసులు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ పార్టీ ఎవరిని వదలదని సంజయ్ అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం మరో మూడు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని.., ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు. తాము అధికారంలోకి రాగానే.. చట్టాలను అతిక్రమించిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.