AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యాదాద్రి తరహాలో వేములవాడ అభివృద్ధి


భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడను రానున్న రోజుల్లో యాదాద్రి తరహాలో అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని చేసే ఏర్పాట్లతో పాటు వేములవాడ క్షేత్రం అభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ అధికారులతో సమీక్షించారు.

ఈ శివరాత్రి ఉత్సవాలకు రాష్ట్రంతో పాటు, దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తారని తెలిపారు. ఆ మేరకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాజన్న ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ముఖ్యంగా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణం మొత్తంలో పారిశుద్ధ్య నిర్వహణ పైన ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

ముందస్తు జాగ్రత్తగా అదనపు అంబులెన్సులు, ఫైర్‌ ఇంజన్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేములవాడ జాతరకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు అదనపు నిధుల కేటాయిస్తామని తెలిపారు. శివరాత్రి వేడుకల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. వేములవాడలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరాలు అందజేశారు.

వేములవాడ గుడి చెరువు బండ్‌ను వరంగల్‌ తరహాలో నిర్మించనున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలు భవిష్యత్తులో పర్యాటక ప్రాంతాలుగా మారనున్నాయని, ఆ దిశగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళికలతో ముందుకు సాగాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే రమేష్‌ బాబు తో పాటు, ఆర్‌ అండ్‌ బీ, శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ అఖిల్‌ మహజన్‌, వేములవాడ ఆలయ అధికారులు, వివిధ విభాగాలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10