AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్‌ రెడ్డి టీడీపీలోకి రండి.. 

టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ ఆహ్వానం

ఆసక్తికరంగా మారిన కాసాని వ్యాఖ్యలు

టీడీపీలోకి తిరిగి రావాల్సిందిగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌  ఆహ్వానించారు. టీడీపీలోకి రేవంత్‌ను సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పార్టీలోకి తిరిగి రావాలని ఆయన కోరారు. తల్లి లాంటి టీడీపీ పార్టీపై ప్రేమ ఉందని రేవంత్‌ అన్నారని, పార్టీలోకి తిరిగి వస్తే ఆయనకు స్వాగతం పలుకుతామని కాసాని స్పష్టం చేశారు

ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులపై కాసాని జ్ఞానేశ్వర్‌ స్పందించారు. పొత్తులపై ఇప్పటికిప్పుడు ఏం చెప్పలేమని, ఎన్నికల సమయంలో తుది నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. త్వరలో టీటీడీపీ పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీ నియామకం జరుపుతామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించనున్నట్లు కాసాని పేర్కొన్నారు.

అయితే ఇటీవల రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ… టీడీపీ తనకు తల్లిలాంటిదని, ఆ పార్టీపై తనకు ఎప్పటికీ ప్రేమ ఉంటుందని వ్యాఖ్యానించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై స్పందించిన రేవంత్‌.. పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొత్తుల అంశం తన పరిధిలో ఉండదని, ఢిల్లీ హైకమాండ్‌ ఆదేశాలను తాము పాటిస్తామని చెప్పారు. రాష్ట్ర నాయకత్వం తరపున తాము సలహాలు, సూచనలు మాత్రమే ఇస్తామని, పొత్తుల అంశంపై అధిష్టానమే తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు.

ఈ క్రమంలో రేవంత్‌ వ్యాఖ్యలపై స్పందించిన కాసాని జ్ఞానేశ్వర్‌.. ఆయనను టీడీపీలోకి ఆహ్వానించడంతో పాటు పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. రేవంత్‌ ప్రస్తుతం హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ పేరుతో రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్రకు భారీగా ప్రజానీకం తరలివస్తోంది. పాదయాత్రలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు కేసీఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రేవంత్‌ ముందుకెళ్తున్నారు. దాదాపు రెండు నెలల పాటు 50కిపైగా నియోజకవర్గాల్లో రేవంత్‌ పాదయాత్ర కొనసాగనుంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో పాదయాత్రకు కొనసాగింపుగా అధిష్టానం ఆదేశాల మేరకు ఈ యాత్ర రేవంత్‌ చేపడుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10