హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు సంస్థ ఎండీ సజ్జనార్ చల్లని కబురు చెప్పారు. వేసవి ఇబ్బందులు దృష్ట్యా బస్టాండ్లలో ఫ్యాన్లు, కూలర్లు, మంచినీళ్లు, బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన.. ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఐపీఎస్ అధికారి సజ్జనార్ టీఎస్‌ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక ప్రజా రవాణా సంస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు. ఆక్యూపెన్సీ పెంచటంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రాయితీలు, నూతన బస్సు సర్వీసులు, కార్గో సర్వీసులు, జీవా పేరుతో టీఎస్ ఆర్టీసీ సొంత వాటర్ బాటిళ్లు ఇలా అనేక మార్పులు తీసుకొచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వేసవి వస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. బస్టాండ్లలో ప్రయాణికుల కోసం కూలర్లు, ఫ్యాన్లు, తాగునీరు, బెంచీలు అందుబాటులో ఉంచాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ బస్‌భవన్‌లో రీజనల్ మేనేజర్లు, డిపో మేనేజర్లు, ఉతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను ప్రజలకు వివరిస్తూ.. వారికి అవగాహన కల్పించాలన్నారు.
ఆర్టీసీ ప్రయాణికులకు నాణ్యమైన, మెరుగైన సేవలను అందించటమే సంస్థ ప్రధాన విధి అనే విషయాన్ని మరిచిపోవద్దని అధికారులకు సూచించారు. వచ్చే రెండు నెలల్లో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. రద్దీకి అనుగుణంగా ప్రయాణికులకు బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీ కల్పిస్తోన్న విషయాన్ని ప్రజలకు వివరించాలన్నారు.