ప్రభుత్వంలో ఉన్నవారు చెప్పే మాటలు, హామీలు అమలు చేయకుండా మోసం చేసినప్పుడు ధైర్యంగా ప్రశ్నించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. త్యాగధనుల స్ఫూర్తితో, రాజ్యాంగ స్ఫూర్తిని ని నిలబెట్టేలా జనసేన శ్రేణులు ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వేస్తుందని, పవన్ కళ్యాణ్ ప్రతి మాట యువత భవిష్యత్తు కోసమే మాట్లాడుతారని అన్నారు. చట్టాలను గౌరవిస్తూ, వ్యవస్థల్ని కాపాడుతూ ముందుకు వెళ్తామన్నారు.మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి విచ్చేసిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ‘మహనీయుల త్యాగాల విలువలను మనమంతా నిలబెట్టాలి. రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేలా పని చేయాలి. 2014లో జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఛైతన్యం తీసుకువచ్చే విధంగా పని చేస్తున్నారు. బాధ్యతగల పౌరులుగా మనం దేని కోసం పోరాడాలి అనే అంశాల మీద దిశానిర్ధేశం చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారు. అదే స్ఫూర్తితో నిబద్దత కలిగిన వ్యక్తులుగా పట్టుదలతో మనమంతా విజయం కోసం పని చేయాలి.
శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల్ని క్షేత్ర స్థాయిలో మనమంతా ముందుకు తీసుకువెళ్లాలి. ప్రతి ఒక్కరు ఎదగాలి అన్న ఆలోచనతో ఆయన చేసిన ప్రస్థానం ఇచ్చిన స్ఫూర్తితో పార్టీని ముందుకు తీసుకువెళ్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ కార్యక్రమం చేపట్టినా అది సమాజహితం కోసమే చేస్తారు. పార్టీగా ఏ కార్యక్రమం చేసినా సమాజానికి, రాష్ట్ర్ర భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగానే చేస్తాం. కేవలం ఓట్ల కోసం జనసేన పార్టీ రాజకీయాలు చేయదు. • నిత్యం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకుడు పవన్ కళ్యాణ్ బుధవారం సబ్ ప్లాన్ అమలు తీరుపైన సదస్సు ఏర్పాటు చేశాం. ప్రతి మానవుడికి సమాన అవకాశాలు అందే విధంగా గతంలో చట్టాలు తీసుకువస్తే.. గడచిన ఐదేళ్ల నుంచి ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఆ అంశాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే సదస్సు నిర్వహించి బలమైన సందేశాన్ని ఇవ్వగలిగాం. నాయకత్వం అంటే కేవలం ఉపన్యాసాలు, పత్రిక ప్రకటనలకు పరిమితం కావడం కాదు. ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యత్తు కోసమే వేయాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి అడుగు మన భవిష్యత్తు కోసమే వేస్తారు. కేంద్ర నాయకత్వాన్ని కలసిన ఏ సందర్భంలో ఆయన వ్యక్తిగత లబ్ది కోసం మాట్లాడింది లేదు. ప్రతి సారి మన రాష్ట్ర కోసం, యువత భవిష్యత్తు కోసమే మాట్లాడారు.