పసిడి ప్రియులకు శుభవార్త.. శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కిందటి రోజు స్థిరంగా ఉండి.. అంతకుముందు రోజు, దాని కంటే ముందు వరుసగా పెరిగిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా ముఖ్యంగా యూఎస్ ఫెడరల్ రిజర్వ్.. కీలక వడ్డీ రేట్లు తగ్గించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క కారణంతోనే బంగారం ధరలు పెరిగాయి. చాలా కాలంగా ఫెడ్ వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉంచుతూ వస్తుండగా.. ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం సహా ఇతర కీలగ గణాంకాలు కూడా మెరుగవడంతో ఫెడ్ వచ్చే సెప్టెంబర్ సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గిస్తామని వెల్లడించింది. దీంతో స్వతహాగానే డాలర్, బాండ్ ఈల్డ్స్‌కు మళ్లీ ఒక్కసారిగా డిమాండ్ భారీగా తగ్గింది. దీంతో సాధారణంగానే బంగారానికి గిరాకీ పెరిగి రేట్లు పెరుగుతూ వస్తున్నాయి. వరుస ర్యాలీ తర్వాత తాజాగా మళ్లీ గోల్డ్ రేటు తగ్గిందని చెప్పొచ్చు.
దేశీయంగా చూస్తే.. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లకు చెందిన పుత్తడి ధర రూ. 100 తగ్గి 10 గ్రాములకు ప్రస్తుతం రూ. 67,050 వద్ద ఉంది. అంతకుముందు ఇది రూ. 210 పెరిగిందని చెప్పొచ్చు. ఇక ఇదే 24 క్యారెట్ల బంగారం రేటు విషయానికి వస్తే రూ. 100 తగ్గగా తులం రూ. 73,150 వద్ద కొనసాగుతోంది. ఇదే దేశ రాజధాని ఢిల్లీలో అయితే తాజాగా రూ. 100 తగ్గి 22 క్యారెట్స్ రేటు 10 గ్రాములు రూ. 67,200 వద్ద ఉంది. 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 100 పతనంతో తులం రూ. 73,300 వద్ద ఉంది.
బంగారం ధరల బాటలోనే వెండి రేట్లు కూడా దిగొచ్చాయి. ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ. 500 తగ్గి ప్రస్తుతం రూ. 88 వేల మార్కు వద్ద ఉంది. అంతకుముందు రోజు రూ. 600 పెరిగింది. ఇక ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో వెండి ధర రూ. 500 పడిపోయి కిలో రూ. 93 వేల వద్ద ఉంది.