అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. సోమవారం వరకూ ఆయన్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సోమవారం విచారణ సమయంలో కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని దర్యాప్తు సంస్థను న్యాయస్థానం ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో సోమవారం వరకూ వైఎస్సార్సీపీ నేతకు ఊరట లభించినట్లే.
సీబీఐ తనపై తీవ్రమైన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. తీవ్రమైన చర్యలంటే ఏంటని న్యాయస్థానం ఆయన్ను ప్రశ్నించింది. అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని కోరుతున్నారా? అని అడిగింది. దీనికి అవినాష్ తరఫున న్యాయవాది స్పందిస్తూ.. సీబీఐ అధికారులు వాంగ్ములం నమోదు చేస్తున్న తీరు పట్ల అనుమానం వ్యక్తం చేశారు. చెప్పింది చెప్పినట్లుగా చేస్తున్నారనే నమ్మకం తమకు లేదన్నారు.
దీనికి సీబీఐ తరఫున న్యాయవాది స్పందిస్తూ.. విచారణను వీడియో రికార్డింగ్ చేస్తున్నామని చెప్పారు. వీడియో రికార్డింగ్ ఏ దశలో ఉందని న్యాయస్థానం ప్రశ్నించగా.. ఆడియో, వీడియో రికార్డులకు సంబంధించిన హార్డ్ డిస్క్‌ను ఇప్పుడే కోర్టుకు ఇస్తామని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ తెలిపారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. సోమవారం సీల్డ్ కవర్‌లో హార్డ్ డిస్క్‌తోపాటు అవిష్ రెడ్డి వివరాలు ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. అప్పటి వరకూ ఎంపీని అరెస్ట్ చేయొద్దని ఆయన తరఫున న్యాయవాది కోర్టును కోరారు.