ముందస్తుపై జోరుగా ఊహాగానాలు
తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కవిత చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కవితను ఈడీ విచారణకు పిలవడంతో.. ఆమెను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సహా అనేక మందిని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేయడంతో.. కవితను కూడా అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే కవితను అరెస్ట్ చేస్తే.. బీఆర్ఎస్ రాజకీయ కార్యాచారణ ఏ విధంగా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోందనే ప్రచారం ఓ వైపు సాగుతుంటే.. ఈ విషయంలో కేసీఆర్ భిన్నమైన వ్యూహంతో ముందుకు సాగాలనే యోచనలో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.
కవిత అరెస్ట్ వ్యవహారం అక్రమమంటూ ప్రజల్లోకి వెళ్లడంతో పాటు.. బీజేపీని టార్గెట్ చేస్తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ అనుకుంటున్నారని ప్రచారం సాగుతోంది. నిజానికి ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలకు జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారమే బీఆర్ఎస్ ఎన్నికలకు వెళుతందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే కేసీఆర్ ఎప్పటికప్పుడు ముందస్తు ఆలోచనలు చేయడంపై ఫోకస్ చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ కవిత అరెస్ట్ అయితే ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల సానుభూతి వస్తుందని.. ఈ క్రమంలో ఎన్నికలకు వెళ్లి బీజేపీని టార్గెట్ చేయాలని కేసీఆర్ అనుకుంటున్నట్టు సమాచారం. దాంతో ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
గత ఎన్నికల సమయంలో కూడా ఎవరు ఊహించని విధంగా కేసిఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నారు. అదే విధంగా ఈసారి కూడా ముందస్తు ఎన్నికలకు వెళిస్తే బిఆర్ఎస్ విజయం ఖాయమని, అందుకు ఇదే సరైన సమయమని ఆ పార్టీ అధినేత భావిస్తున్నట్లు తెలుస్తోంది.