కన్నీళ్లు తెప్పిస్తున్న చిన్నారి చివరి వీడియో
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నవనీత మృతి
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన తండ్రికి ఓ 13 ఏళ్ల చిన్నారి చెప్పిన మాటలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘అమ్మను బాగా చూసుకో నాన్నా.. కొట్టకు.. నేను చనిపోతున్నా నాన్నా’ అంటూ 8వ తరగతి విద్యార్థిని నవనీత తండ్రికి చెప్పింది. రంగారెడ్డి జిల్లాలోని జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల చిన్నారి నవనీత ఛాతినొప్పితో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత ప్రస్తుతం 8వ తరగతి చదువుతుంది. తల్లిదండ్రులు మేస్త్రి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం నవనీత స్కూల్ నుంచి ఇంటికొచ్చింది. తల్లిదండ్రులతో మాట్లాడుతూ గుండె దగ్గర నొప్పి వస్తుందని చెప్పింది.
తల్లిదండ్రులు నవనీతను హుటాహుటిన షాద్‌నగర్‌లోని చిన్నపిల్లల హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు నవనీత ప్రాథమిక చికిత్స అందించారు. గుండెకు సంబంధించిన ప్రాబ్లం ఉందని, మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తెను హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రిలో అడ్మిట్ చేయించారు. కొద్దిరోజులుగా నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి 8 గంటలకు నవనీత మృతి చెందింది. అయితే నవనీత చికిత్స పొందుతూ ఆస్పత్రి బెడ్‌పై చెప్పిన చివరి మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ‘నాన్న అమ్మని కొట్టకు.. తిట్టకు.. మంచిగా చూసుకో నాన్న.. నేను చనిపోతాను నాన్న.. నేనిక బతకను’ అంటూ ముద్దు ముద్దు మాటలతో చిన్నారి తండ్రికి చివరిగా చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి.