మెదక్: అత్తింటి వారు కట్నం కింద పెట్టాల్సిన బంగారం పెట్టలేదని ఓ వ్యక్తి నానా హంగామా సృష్టించాడు. విద్యుత్ స్తంభం ఎక్కి అక్కడి నుంచి దూకేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన మెదక్ పట్టణం గాంధీ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా గాంధీ నగర్‌కు చెందిన కొడపాక శేఖర్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం పట్టణానికి చెందిన ఓ యువతిని ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సమయంలో బంగారం పెడతామని యువతి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ ఇప్పటి వరకు బంగారం పెట్టలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన శేఖర్ నిన్న (మార్చి5న) కరెంట్ స్తంభం ఎక్కి హల్‌చల్ చేశాడు. బంగారం పెట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటానని అత్తింటి వారిని బెదిరించాడు. విద్యుత్ అధికారులతో మాట్లాడిన స్థానికులు.. కరెంట్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని శేఖర్‌ను కిందకు దింపేందుకు ప్రయత్నించారు. అయినా కిందకు దిగని శేఖర్.. చాలా సేపటి వారిని ముప్పతిప్పలు పెట్టాడు.
మెదక్ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బట్టి జగపతి, స్థానిక డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకొని శేఖర్‌కు నచ్చజెప్పారు. అత్తింటి వారితో బంగారం ఇప్పిస్తామని హామీ ఇవ్వటంతో అతడు కిందకు దిగివచ్చాడు. అత్తంటి వారు బంగారం పెట్టకపోతే కరెంట్ స్తంభం ఎక్కటమేంటని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇది పైత్యం కాకపోతే మరేంటని మండిపడుతున్నారు.