తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో నిన్న (ఆదివారం) గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం నుంచి కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సీఎం కేసీఆర్‌ను పరీక్షించిన ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని డాక్టర్ల బృందం ఆయనకు పలు రకాల పరీక్షలు నిర్వహించారు.
అయితే సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో చేరటంపై బీజేపీ మహిళా నేత విజయశాంతి ఘాటుగా స్పందించారు. లిక్కర్ స్కాంలో మీడియా ప్రశ్నల నుంచి తప్పించుకొని.., సమాధానం వెతుక్కునే పనిలో భాగంగానే ఆయన ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆసుపత్రిలో చేరి ఉంటారని అన్నారు. ఇది తన అభిప్రాయం కాదని.., తెలంగాణ ప్రజలు ఆ విధంగా అనుకుంటున్నారని సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యనించారు.
మీడియా నుంచి తప్పించుకోవటానికే.. సమాధానం వెదుక్కునే ప్రయత్నానికి సమయం కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హాస్పిటల్‌లో చేరి ఉంటారని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నరు.’’ అని విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.