దేశానికి, ప్రపంచానికి ఎంతోమంది మేధావులను అందించిన వరంగల్ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్స్ దుస్థితి అధ్వాన్నంగా మారింది. ఎలుకలు ఏకంగా హాస్టల్ గదుల్లోకి ప్రవేశించి విద్యార్థులను కొరికి గాయాలపాలు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ D బ్లాక్‌లో వెంటిలేటర్స్ నుంచి హాస్టల్ గదిలోకి ప్రవేశించిన ఎలుకలు ముగ్గురు విద్యార్థుల కాళ్ళు, చేతులు కొరికాయి. చెత్తాచెదారంతో పాటు ఆహార పదార్థాలు పోగవడంతో ఎలుకలు, తేళ్లు, పాములు హాస్టళ్ల ఆవరణలో తిష్ట వేశాయి. యూనివర్సిటీ క్యాంపస్‌లో పద్మాక్షి గర్ల్స్ హాస్టల్ తో పాటు,న్యూ పీజీ హాస్టల్, పోతన, గణపతిదేవా, అంబేద్కర్, జగ్ జీవన్ ఫార్మసీ హాస్టల్ తో కలిపి ఎనిమిది హాస్టళ్లు ఉన్నాయి.. ఇందులో మూడు వేల మందికి పైగా విద్యార్థులు ఉంటున్నారు. ఎలుకల బెడదతో ప్రశాంతంగా పడుకోలేకపోతున్నారు విద్యార్థులు.
విషపు పురుగులు, కుక్కల బెడద కూడా ఉందని గర్ల్స్ హాస్టల్ విద్యార్థులు వాపోతున్నారు. బాయ్స్ హాస్టళ్లలో కూడా ఇదే దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ఎన్నిసార్లు కంప్లయింట్ చేసినా వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ఎలుకలు, విషపు పురుగుల స్వైర విహారంతో హాస్టల్ విద్యార్థుల బతుకు దినదినగండంలా మారింది. ప్రాణాలు పణంగా పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.