AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అవినీతి భేతాళుడు జోగురామన్న

నమ్మక ద్రోహానికి మారుపేరు
దళితబంధు’లో కమిషన్లు గుంజుతున్న ఎమ్మెల్యే
ప్రజల సమస్యలు పట్టని నాయకుడు
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు
బీజేపీలో చేరిన సీనియర్‌ నాయకులు ఐనేని సంతోష్‌రావు

ఆదిలాబాద్‌: నమ్మక ద్రోహానికి మారుపేరు ఎమ్మెల్యే జోగు రామన్న అని, ఆయన ఆదిలాబాద్‌ నియోజకవర్గాన్ని తన జాగీరుగా భావిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు, యువనేత కంది శ్రీనివాసరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని ప్రజా సేవా భవన్‌లో సీనియర్‌ రాజకీయ నేత, వ్యూహకర్త ఐనేటి సంతోష్‌రావు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. ఆయనకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. శాలువా, పూలబోకేతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే జోగు రామన్న, రాష్ట్ర ప్రభుత్వ పాలనతీరుపై విరుచుకుపడ్డారు.

ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కుటుంబ పాలన కొనసాగుతోందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జోగు రామన్న ఏకపక్ష ధోరణి, వ్యవహారశైలి నచ్చకనే ఎందరో మంది సీనియర్‌ నేతలు బీఆర్‌ఎస్ వీడి గొప్ప లక్ష్యంతో బీజేపీలో చేరుతున్నారన్నారు. జోగు రామన్న తొమ్మిదేండ్లలో చేసిందేమీలేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. 4 వేల కోట్లతో అభివృద్ధి చేశామని చంకలు గుద్దుకోవడం కాదని, దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు. ఎన్ని ఎత్తుగడులు వేసినా, ప్రజలను మభ్యపెట్టాలని చూసినా రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తు చేయడం ఖాయమని, ఓటమిపాలు కావడం తథ్యమని జోస్యం చెప్పారు. తరోడ వంతెన దెబ్బతినడానికి, ప్రజలు అష్టకష్టాలు పడడానికి ముమ్మాటికీ జోగు రామన్నదే బాధ్యతంటూ మండిపడ్డారు. సాత్నాల ప్రాజెక్టు పూడిక తీయకుండా..సాగునీరందించకుండా రైతుల ఉసురు పోసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు టీఎస్‌పీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న పరీక్షలపై నమ్మకంలేదని, యూపీపీఎస్సీ ద్వారానే పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడే కాదు.. గతంలో జరిగిన అన్ని పోటీ పరీక్షల పేపర్లు లీక్‌ అయినట్టు సమాచారం అందుతోందన్నారు. ఒక్కో పోస్టు రూ.40 నుండి 50 లక్షలకు అమ్ముకోవడానికి దళారులు, ముఠాలు తిరుగుతున్నారన్నారు. ఎంతో మంది పేదలు ఉద్యోగాలను నమ్ముకుని పుస్తెలు, ఆస్తులు అమ్ముకొని ప్రిపేర్‌ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవితాలతో ఆటలాడుకోవద్దని హెచ్చరించారు. ఎమ్మెల్సీ కవిత విషయంలోనూ ఈడి, సిబిఐ దగ్గర స్పష్టమైన ఆధారలున్నాయని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత, కౌన్సిలర్‌ ఉష్కెం రఘుపతి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్‌ జీవీ. రమణ, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్‌, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్‌, బీజేపీ నాయకులు విఠల్‌, సన్ని, తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10