మటన్ ముక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణం తీసింది.. బుడిబుడి అడుగులు వేస్తూ కుటుంబాన్ని సంతోషంలో నింపుతున్న ఆ చిన్నారి ఇక లేదు అన్న విషయం తెలిసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ షాకింగ్ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. మాంసం తిని ఒకే కటుంబానికి చెందిన 9 మంది అస్వస్థతకు గురైన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. వివరాల ప్రకారం.. అరకులోయ మండలం గన్నేల పంచాయతీ తడక గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంగళవారం రాత్రి మటన్ వండుకుని తిన్నారు. అనంతరం వారు నిద్రలోకి జారుకున్నారు. అయితే, అర్ధరాత్రి నుంచి కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. తీవ్రమవ్వడంతో గ్రామస్థులు వారిని స్థానిక ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు.
ఈ క్రమంలో చికిత్స పొందుతూ మీనాక్షి అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. మిగిలినవారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన చికిత్స నిమిత్తం వారిని విశాఖపట్నం తరలించినట్లు వైద్యులు తెలిపారు.
బాధితుల అస్వస్థతకు ఫుడ్ పాయిజనే కారణమని వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ఈ గిరిజనులు మేక మాంసం తిన్నారని పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఘటన గిరిజన తండాల్లో కలకలం రేపింది.