హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు ఈడీ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందుకు విచారణకు హాజరుకాలేనని, అలాగే ఆరోగ్యం కూడా బాగోలేదని విచారణకు మరో తేదీని నిర్ణయించాలని కవిత తన న్యాయవాదుల ద్వారా ఈడీకి సమాచారం అందజేశారు. ఈ క్రమంలో ఈడీ అధికారుల ముందు ఉన్న మార్గాలు ఏంటి?… విచారణకు కవిత హాజరుకావాల్సిందేనా?.. లేక అరెస్ట్ చేసి విచారణ జరుపుతారా?.. అనే అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడారు.
ఈడీ (ED) ఇచ్చిన నోటీసుపై కవిత (Kavitha) సమాధానం ఇచ్చారని అన్నారు. కవిత అంశంపై ఈడీ దగ్గర కొన్ని మార్గాలు ఉన్నాయన్నారు. ఈడీ మరో తేదీని ఇచ్చే అవకాశం ఉందని, లేదా సుప్రీంకోర్టులో కేసు విచారణ ఉన్నందున అది ముగిసేవరకు వేచి చూసే అవకాశం ఉందని తెలిపారు. అలాగే కస్టడీలో ఉన్నవారి దగ్గరకు రమ్మని కవితకు సమన్లు జారీ చేసే అవకాశం కూడా ఉందని వెల్లడించారు. కవిత తన సెల్‌ఫోన్లను నిర్వీర్యం చేశారని అంటున్నారని, ఆ ఫోన్లలో ఈడీ తమకు అవసరమైన అంశాలు ఉన్నాయని… దీనిని ప్రాధాన్యతగా భావించే అవకాశం ఉందని తెలిపారు. అన్ని అంశాలను బేరీజు వేసుకునే కవిత అరెస్ట్‌పై నిర్ణయం ఉంటుందని ఏబీఎన్‌తో మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.