హైదరాబాద్ నార్సింగి ఇంటర్ కాలేజీ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటన తెలంగాణలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హన్మకొండలో ఇంటర్ చదువుతున్న ఫస్టియర్ స్టూడెంట్ హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన నాగజ్యోతి హన్మకొండలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. అదే కాలేజీకి చెందిన హాస్టల్‌లో ఉంటూ క్లాసులకు వెళ్లేది.
ఈ క్రమంలో నిన్న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా.. పరీక్ష రాసి గత రాత్రి హాస్టల్‌కు చేరుకుంది. తోటి విద్యార్థులు బయటకు వెళ్లిన సమయంలో హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన మిగతా విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు సమాచారం అందించగా.. వారు సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే జ్యోతి మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కళాశాల వద్ద భారీగా మెహరించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఇంటర్ పరీక్షలు ప్రారంభమైన రోజే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం చర్చనీయాంశమైంది. పరీక్ష సరిగా రాయకపోవటంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. విచారణ తర్వాత వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
సంచలనం సృష్టించిన సాత్విక్ ఘటన..
గత నెల ఇంటర్ స్టూడెంట్ సాత్విక్ ఆత్మహత్య ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కాలేజీ యాజమమాన్యం వేధింపులు తట్టుకోలనే సాత్విక్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు కాలేజీ యాజమాన్యమే కారణమని.., తనను తీవ్రంగా వేధించారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ సాత్విక్ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో సాత్విక్ తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.