హైదరాబాద్: సికింద్రాబాద్ స్వప్నలోక్ అగ్నిప్రమాద ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో వీఎమ్ ఫైర్ సొల్యూషన్స్ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఈ వీఎమ్ ఫైర్ సొల్యూషన్స్‌లోనే మృతులు వెన్నెల, త్రివేణి, శివ విధులు నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ ఒక్కక్కరి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసి యువతీ, యువకులకు ఉద్యోగం ఇచ్చింది. ఉద్యోగాల పేరుతో మహబూబాబాద్, వరంగల్ నుంచి దాదాపు 250 మంది నిరుద్యోగులకు కంపెనీ ఎర వేసింది. అయితే సరైన ప్రమాణాలు పాటించకుండానే కంపెనీ కార్యకలాపలు కొనసాగిస్తోంది. బోగస్ కార్యకలాపలతో యువతీ, యువకుల మృతికి కారణమైన వీఎమ్ ఫైర్ సొల్యూషన్స్‌పై చర్యలు తీసుకోవాలంటూ మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు… గాంధీ మార్చురీలో స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటన మృతుల డెడ్‌బాడీలకు 11 గంటలకు పోస్ట్ మార్టం ప్రారంభంకానుంది. ఈ క్రమంలో మార్చురీ వద్దకు మృతుల కుటుంబ సభ్యులు చేరుకున్నారు. తమ పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు బోరుమంటున్నారు. కాగా.. గాంధీ ఆసుపత్రి వద్ద పోలీసుల ఓవర్ యాక్షన్ చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మీడియాను లోపలకి అనుమతించేందుకు పోలీసులు నిరాకరించారు. మృతుల కుటుంబ సభ్యులు పెద్దఎత్తున తరలివస్తుండటంతో పోలీసులు భద్రతను మరింత పెంచారు. క్విక్ యాక్షన్ టీంలను గాంధీ ముందు మోహరించారు. రోగులు, రోగుల కుటుంబ సభ్యులను మాత్రమే పోలీసులు లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి.