జోగురామన్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్న శ్రీనన్నకు మద్దతు
ఆదిలాబాద్: ఎమ్మెల్యే జోగురామన్న చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరిస్తామని, జోగురామన్న ఆగడాలను ఇక సాగనివ్వబోమని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కంది శ్రీనివాస రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో మహిళలు పార్టీలో చేరారు. శ్రీనివాసరెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఎమ్మెల్యే జోగురామన్న చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్న తీరును చూసి ఆకర్షితులపై బీజేపీలో చేరినట్లు మహిళలు పేర్కొన్నారు. అంతకుముందు పట్టణంలోని 5వ,7వ వార్డుల్లోని శాంతి నగర్, శ్రీ రామ్ కాలనీ, కొత్త కుమ్మరివాడ, న్యూ హౌసింగ్ బోర్డు కాలనీల నుంచి భారీ సంఖ్యలో వచ్చిన మహిళలకు కంది శ్రీనివాస రెడ్డి సాదర స్వాగతం పలికారు. వారికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగురామన్న, ఆయన కుమారులు చేస్తున్న అవినీతి, అక్రమాలు, అన్యాయాల గురించి వారికి తెలిపారు. డబుల్ బెడ్రూంలు, పెన్షన్లు, స్కాలర్షిప్లు, నిరుద్యోగభృతి, దళితబంధు, రైతు రుణమాఫీ లాంటి అబద్దపు హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయం, ప్రజాసేవ భవన్‌లో సందడి నెలకొంది. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్ , గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కొడప సోనేరావు, వెంకటేష్ భోయర్ , సంతోష్ సింగ్ ఠాకూర్ పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.