హైదరాబాద్‌లోని చందానగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు బ్రేకప్ చెప్పిందని మనస్తాపంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. చందానగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. సదాశివపేట ఆరూరు గ్రామానికి చెందిన అఖిల్ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాను పని చేసే కంపెనీలోనే ఓ అమ్మాయిని అఖిల్ ప్రేమించాడు. ఏమైందో ఏమోగానీ, ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ప్రేమించిన యువతి తనతో మాట్లాడటం లేదని మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం నాడు చందానగర్ పీఎస్ పరిధిలోని ఓ లాడ్జ్‌లో రూమ్ తీసుకున్నాడు అఖిల్. తన ప్రియురాలు తనతో మాట్లాడటం లేదని, ఫోన్ నెంబర్ బ్లాక్ చేసిందని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలోనే అఖిల్ రూమ్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు సూసైడ్ నోట్ రాసి, తన ఆత్మహత్యకు గల కారణాలను వివరించాడు అఖిల్. విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని అఖిల్ మృతదేహాన్ని పరిశీలించారు. గదిలో లభించిన సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకుని, ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అని నిర్ధారించారు. అఖిల్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.