ప్రజలకు వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని తాజా వెదర్ బులిటెన్‌లో పేర్కొంది. కొన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.
నేడు కొమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఇక సోమవారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అన్ని జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు వడగండ్లతో కూడిన వానలు పడే అవకాశముందని తెలిపింది. ఇక మంగళవారం, బుధవారం, గురువారం పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.