అకాల వర్షాలతో అపార నష్టం
బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో వడగళ్ల వాన
5వేల ఎకరాలకుపైగా దెబ్బతిన్న పంటలు
తక్షణం పరిహారం ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది డిమాండ్
ఆదిలాబాద్: ప్రకృతి రైతు పై కన్నెర్ర చేసింది.ఆరుగాలం కష్టపడి పడిరచిన పంట చేతికొచ్చే సమయంలో..తమ ఇంట ధాన్యం సిరులు కురుస్తాయనుకుంటే, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం పంటలను నేల పాలు చేసింది. రైతన్నల ఆశలను అడియాశలు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో కురిసిన వడగళ్ల వాన రైతుల కంట కన్నీరు పెట్టించింది. అకాల వర్షం దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది.మూడు మండలాల్లోని పలు గ్రామాల్లో దాదాపు 5 వేల ఎకరాల్లో మొక్కజొన్న, జొన్న, నువ్వు పంటలకు నష్టం వాటిల్లింది. పంట నష్టపోయిన రైతలకు ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
బోథ్ మండలంలోని ధనోర, కౌట, గుట్ట గూడ, కన్గుట్ట గ్రామాల్లో ఈదురు గాలులు వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. చేతి కొచ్చిన పంటలను తుడిచిపెట్టుకు పోయింది.ఐదేళ్లుగా మొక్కజొన్న నువ్వు సాగు చేస్తున్నామని కాని ప్రస్తుత ప్రకృతి బీభత్సానికి పంటలన్నీ నేల పాలయ్యాయని ప్రభుత్వం తమకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. కొద్ది రోజుల్లో పంట చేతికొస్తుందని తమ కష్టాలు తీరుతాయని ఎన్నోఆశలు పెట్టుకున్న రైతులను వడగళ్లవాన కళ్ళ నీళ్లు పెట్టించింది. అప్పులు తెచ్చి వేసిన జొన్న, మొక్కజొన్న, నువ్వు పంటలు అకాలవర్షానికి నేల రాలిపోవడంతో అన్నదాతలు బోరుమంటున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
అటు బోథ్ మండలం సొనాల, పొచ్చర లో ఈదురు గాలులకు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి.ఇచ్చోడ మండలంలో విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అర్ధరాత్రి వరకు విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడిరది. నేరడిగొండ లో చెట్లు విరిగి పడి రవాణాకు కొద్ది సేపు అంతరాయం కలిగింది. మొత్తం మీద వడగళ్ల వాన జిల్లా ప్రజలకు నష్టాన్ని మిగిల్చింది.