లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ED) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం ఉదయం 11 గంటలకు హాజరవుతున్నారని ఆ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి (Ranjith Reddy) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈడీ (ED)కి భయపడి హాజరు కావడం లేదని.. చట్టంపై గౌరవంతో విచారణకు కవిత వెళుతున్నారని అన్నారు. కేంద్రం విపక్షాలను టార్గెట్ చేసి దర్యాప్తు సంస్థలతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఇతరులపై విచారణ చేయకుండా కేవలం విపక్షాలపైన దాడులు జరుపుతున్నారని ఎంపీ రంజిత్ రెడ్డి ఆరోపించారు.
ఢిల్లీలో సీఎం కేసీఆర్ (CM KCR) నివాసానికి చేరుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) మాట్లాడుతూ… న్యాయనిపుణులు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావులతో కవిత సమావేశమై చర్చిస్తున్నారన్నారు. ఇది తెలంగాణ ఆడబిడ్డపై దాడి అని, ఈడీ, సీబీఐ (CBI) సంస్థలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) చేతుల్లో ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌పై ఉన్న కోపంతో దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపారని.. అందులో భాగంగా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. లక్షల కోట్లు ఎగ్గొట్టినవారిని వదిలేసి తెలంగాణ ఆడబిడ్డను వేధిస్తున్నారన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ గురించి ఢిల్లీ కేబినెట్ నిర్ణయం ప్రకారం ఇందులో ఏపీ (AP), తెలంగాణ (Telangana) వాళ్ళు ఉంటే ఉండొచ్చునని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.