తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. వైఎస్ వివేకానందా రెడ్డి హత్య కేసులో ఎ4 దస్తగిరిని అప్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి స్టేట్‌మెంట్‌తోనే ఎంపి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని సిబిఐ ప్రశ్నించన విషయం తెలిసిందే. దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి హితువు పలికారు. సిబిఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్‌మెంట్ ఇస్తున్నారని, వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించారన్నారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వడం సరికాదని భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని దస్తగిరి కొనుగోలు చేశాడని, దస్తగిరి బెయిల్ సమయంలోనూ సిబిఐ సహకరించిందన్నారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని, దస్తగిరికి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్‌లో భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు.