వడగండ్ల వాన రైతుల కళ్లల్లో కన్నీరు మిగిల్చింది. ప్రకృతి రైతుపై కన్నెర్ర చేసింది.ఆరుగాలం కష్టపడి పడిరచిన పంట చేతికొచ్చే సమయంలో..తమ ఇంట ధాన్యం సిరులు కురుస్తాయనుకుంటే, ఈదురు గాలులతో కురిసిన అకాల వర్షం పంటలను నేల పాలు చేసింది.రైతన్నల ఆశలను అడియాశలు చేసింది.రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వడగళ్ల వాన రైతుల కంట కన్నీరు పెట్టించింది.అకాల వర్షం దెబ్బకు వేలాది ఎకరాల్లో పంటనష్టం జరిగింది. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిని.. నిరుపేదలు దిక్కులేని వారయ్యారు.గూడు చెదిరి రోడ్డున పడ్డారు. ఓ వైపు చేతికొచ్చిన పంట నీటిపాలై రైతులు కన్నీరుపెడుతుంటే .. మరోవైపు ఉండటానికి ఇళ్లులేక నిరాశ్రయులైన పేదలు బోరుమంటున్నారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రాయుడుపాలెం గ్రామంలో గాలి వాన బీభత్సం వల్ల మొక్కజొన్న రైతు రోడ్డున పడ్డాడు. ఎకరానికి 35 వేల నుండి 40 వేల వరకు పెట్టుబడి పెట్టి తీరా పంట చేతికి వచ్చే సమయానికి.. అకాల వర్షంతో పంట పడిపోయి తీవ్ర నష్టం కల్పించింది. ఇంకొక 20 రోజుల్లో పంట చేతికి వస్తుందని ఆశపడ్డామని, ఈ క్రమంలో ఈ అకాల వర్షం రైతులు ఇంట కన్నీటిని మిగిల్చిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సన్న చిన్న కారు రైతులు ఈ ప్రాంతంలో సుమారు 200 నుండి 300 ఎకరాలు మొక్కజొన్న పంట వేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం తమ ఆవేదనను అర్థం చేసుకొని రైతులను కాపాడాలని కోరారు.
గులాబ్ తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాలో పంటలు తడిసి రైతున్నకు కంటతడి మిగిలింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాచన్నగూడెంలో గతరాత్రి కురిసిన వర్షానికి ఓ రైతు 4 ఎకరాల్లో వేసిన జీడిమామిడి తోటలో తొలిదశలో ఉన్న జీడిమామిడి నేలరాలిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రతి సంవత్సరం నాలుగు లక్షల రూపాయలు ఆదాయం వచ్చేదని.. ఈసారి వర్షం వల్ల నాలుగు లక్షల రూపాయలు నష్టo వచ్చిందని రైతు వాపోయాడు.ఈ అకాల వర్షం వల్ల జీడిమామిడి తోట పంట నష్టం వాటిల్లిందని తెలిపారు.అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,సీఎం కేసీఆర్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
చర్ల మండలంలో అకాల వర్షాలతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వచ్చే సమయంలో.. వడగండ్ల వాన అన్నదాతని తీవ్ర నష్టాలు పాలుచేసింది. తాలిపేరు పరివాహక ప్రాంతంలో ఇసుకపై మిర్చి ఆరబోసిన రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.తాలిపేరు గేట్లు ఎత్తేస్తే… పూర్తిగా పంట తడిసే అవకాశం ఉందని భయపడ్డారు.దీనిపై వెంటనే అప్రమత్తమైన రైతులు తాలిపేరు ఏఈతో మాట్లాడగా.. గేట్లు ఎత్తలేదని చెప్పడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మిర్చి రైతులు కుదేలయ్యారు. పంట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం మిర్చి రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. పినపాక నియోజకవర్గంలో భారీ వర్షాలకు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాది దిగుబడితో పాటు మిర్చి ధర బాగానే ఉందని ఆనందపడ్డ రైతులకు.. అకాల వర్షాలు ఆందోళనను మిగిల్చాయి. పినపాక, అశ్వాపురం, మణుగూరు మండలాల్లోని మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం మారుమూల ఏజెన్సీ గిరిజన గ్రామమైన తిప్పగుట్టలో భారీవర్షానికి జనజీవనం అస్తవ్యవస్థమైంది.తిప్పగుట్టలో సుమారు 100 కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈదురు గాలులు తిప్పగుట్ట గ్రామంలోని ఇళ్లులు దెబ్బతీశాయి. భారీ వర్షం కారణంగా ఇంటి పైకప్పులు లేచిపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.సుమారు 45 ఇళ్ళ పైకప్పు రేకులు లేచిపోయాయి. కొన్ని ఇళ్ళు ధ్వంసం కాగా మరి కొన్ని ఇళ్ళు పాక్షికంగా దెబ్బ తిన్నాయి.రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.అకాల వర్షానికి తమ ఇళ్ళు దెబ్బతినడంతో దిక్కులేని వారయ్యారు. ఇంట్లోని నిత్యావసర సరుకులు, ధాన్యం, దుస్తులు తడిచిపోయాయి. విషయం తెలుసుకున్న లక్ష్మీదేవి పల్లి జడ్పిటిసి మేరెడ్డి వసంత గ్రామాన్ని సందర్శించారు. దెబ్బతిన్న ఇండ్లను సందర్శించి జరిగిన నష్టాన్ని రెవెన్యూ అధికారులకు వివరించారు.తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని అధికారులను కోరారు.
వడగండ్ల వానకు వరంగల్ మహానగరమంతా నీటిమయమైంది. రాళ్ల వర్షానికి చెట్లు నేలమట్టమైయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అకాల వర్షానికి ఇండ్లలోకి నీరు చేరింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వర్షం కారణంగా పంట నేలమట్టమై.. రైతన్నలు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.
పాలకుర్తి నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా నేలకొరిగిన పంటలను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. తొర్రూరు, పెద్ద వంగర, కొడకండ్ల, దేవరుప్పుల తదితర మండలాల్లోని పలు గ్రామాల్లో పంటనష్టాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. పంటనష్టంపై అంచనావేశారు. పలు గ్రామాల్లో నిరాశ్రయులైన ప్రజలకు కలిసి మాట్లాడి ధైర్యం చెప్పారు.
హనుమకొండ జిల్లా ఆత్మకూరు, దామెర మండల కేంద్రంలో అకాల వర్షానికి దెబ్బతిన్న మొక్కజొన్న,క్యాబేజీ తోటలను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. వర్షం కారణంగా పూర్తిస్థాయిలో రైతులకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టంపై అధికారులు త్వరగా అంచనా వెయ్యాలని సూచించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కౌలు రైతులకు కూడా న్యాయం చేస్తామని తెలిపారు. పరకాల, నడికూడా మండల కేంద్రాల్లో అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ అవతాయని తెలిపారు.
ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో నాలుగు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.కల్లాలలో ఆరబోసిన మిర్చి తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం నిండా ముంచిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది మిర్చి రైతులకు మార్కెట్ లో స్వల్పంగా గిట్టుబాటు ధరలు పెరిగి కొంత ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయి. ఇంతలో ప్రకృతి వారిపై కన్నెర్ర చేసింది. ప్రకృతి ఉగ్రరూపం దాల్చడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల కళ్లల్లో నీళ్లు నిండిపోయాయి. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని .. అప్పుడే రైతే రాజ్యం వస్తుందని, గ్రామ గ్రామాన రైతులు అభివృద్ధి సాధిస్తారని అంటున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు అపార నష్టాన్ని మిగిల్చాయి. వడగళ్ల వానతో చేతికి వచ్చిన పంట నీటిపాలైంది.ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో వడగళ్ల వాన తీవ్రత ఎక్కువగా ఉంది. మూడు రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి.. కోహిర్ మండలం బడంపేటలో మొక్కజొన్న, జొన్న, బొప్పాయి, మామిడి, టమాట పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాయికోడ్ మండలంలో సుమారు 300 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మరోవైపు నారాయణఖేడ్ నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో ఉల్లి పంట దెబ్బతిన్నది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు. ప్రాథమికంగా జిల్లా వ్యాప్తంగా మూడు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
జగిత్యాల జిల్లా రూరల్ మండలం చలిగల్ గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షంతో తీవ్రంగా నష్టపోయామని మొక్కజొన్న రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సర్వే చేసి తమను ఆదుకోవాలని అన్నధాతలు కోరుతున్నారు. పంటకు నష్టపరిహారం ఇప్పించాలని సర్కార్ కు విజ్ఞప్తి చేశారు.
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గత రెండు రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు , వడగళ్ల వానలతో రైతాంగానికి తీవ్రంగా నష్టం జరిగిందనీ, ఆ నష్టాన్ని అంచనా వేయడానికి సంబంధిత అధికారులను వెంటనే పంపించాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేవారు. వెంటనే జరిగిన నష్టంపై కలెక్టర్ నివేదిక రూపొందించిన మంత్రులతో పాటు సీఎంకు పంపించాలని కోరారు. వెంటనే చర్యలు తీసుకునేలా… స్థానిక ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు.