నేడు కేంద్రం కీలక సమావేశం..
కరోనా మహమ్మారి బారి నుంచి ప్రపంచం ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడే మరోమారు పలు దేశాల్ని వైరస్ వణికిస్తుంది. భారత దేశంలో కోవిడ్ వైరస్ చాపకింద నీరులా ప్రజల్ని వెంటాడుతూనే ఉంది. దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ కేసులు మళ్లీ ఊపందుకుంటున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం… గత 24 గంటల్లో 44,225 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 918 కొత్త కేసులు నమోదైనట్టు తెలిసింది. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరింది.
ఇక గత 24 గంటల్లో నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,806కి చేరింది. ఈ నేపథ్యంలోనే దేశంలో కోవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు ఈరోజు కీలక సమావేశంలో కేంద్రం సమావేశం కానుంది. దీంతో ప్రజలందరిలోనూ మరోమారు ఆందోళనమొదలైంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొత్త ఆంక్షలు తిరిగి వస్తాయా..? అనే సందేహం సర్వత్ర వ్యక్తమవుతోంది.
మరోవైపు, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం ఒక్కరోజే 1,000కి పైగా కొత్త కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితి 129 రోజుల తరువాత ఇదే తొలిసారి. కాగా, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ లలో అత్యధిక యాక్టివ్ కేసులు నమోదైనట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మూడు రాష్ట్రాలతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కొవిడ్ కట్టడికి ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించింది.