బంగారం ధర రోజురోజుకు సరికొత్త గరిష్టాలను తాకుతోంది. సోమవారం రోజు మల్టీ కమొడిటీ ఇండెక్స్‌లో గోల్డ్ రేటు 10 గ్రాములకు తొలిసారి రూ. 60 వేల మార్కును అధిగమించింది. మండే ట్రేడింగ్ సెషన్‌లో ఇలా జరిగింది. అమెరికాలో బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభం దీనికి ప్రధాన కారణంగా వినిపిస్తోంది. MCX గోల్డ్ ఫ్యూచర్స్ మధ్యాహ్నం 12.55 గంటల సమయంలో 1.51 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.60,280 వద్ద ఉంది. ఇక ఇదే సమయంలో వెండి ధరలు కూడా పుంజుకున్నాయి. MCX సిల్వర్ రేట్లు 0.87 శాతం లేదా రూ.599 పెరిగి కేజీకి రూ.69,100 వద్ద ట్రేడవుతోంది. బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకడం.. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించేందుకు సంకేతాలు అని, వడ్డీ రేట్లు తగ్గేందుకు దోహదపడుతుందని చెప్పారు కామా జువెలరీ ఎండీ, సీఈఓ కొలిన్ షా.
రానున్న కొన్ని నెలల్లో గోల్డ్ రేటు మరింత పైకి చేరుతుందని తాము నమ్ముతున్నట్లు చెప్పారు షా. 10 గ్రాములకు రూ. 61000 – 62000 మధ్య ట్రేడవొచ్చని అభిప్రాయపడ్డారు. ఇక అంతర్జాతీయంగా చూస్తే గనుక ఔన్సుకు 2050 నుంచి 2100 డాలర్ల వరకు వెళ్తుందని అన్నారు.
మరోవైపు బంగారం ధర రానున్న రోజుల్లో పెరుగుతుందని, దీనికి కారణం డాలర్ పడిపోవడమేనని చెప్పారు అల్ఫా క్యాపిటల్ కో ఫౌండర్ డా. ముకేశ్ జిందాల్. అమెరికాలో బ్యాంకుల వరుస పతనంతో.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు చేపట్టకపోవచ్చని, ఇది డాలర్‌ను మరింత పడిపోయేలా చేస్తుందని వ్యాఖ్యానించారు. ఫెడ్ సమావేశం మార్చి 21,22 తేదీల్లో జరగనుంది. అప్పటివరకు ఆగితే మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం వడ్డీ రేట్లకు సంబంధించి ఫెడ్ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.