ఢిల్లీ లిక్కర్ కేసులో ఇవాళ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు విచారించనున్నారు. విచారణకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడనున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సమయంలో ఫోన్లకు సంబంధించి ఈడీ చేస్తున్న ఆరోపణలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ధ్వంసం చేశారన్న ఫోన్లను మీడియాకు చూపించే చాన్స్ ఉంది. సోమవారం విచారణ వివరాలనూ మీడియాకు కవిత చెప్పనున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు సుధీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల 15 నిమిషాల వరకూ విచారణ చేశారు. దాదాపు 11 గంటలపాటు ఈడీ విచారణ కొనసాగింది.
ఎమ్మెల్సీ కవితను 14 ప్రశ్నలు అడిగారు ఈడీ అధికారులు. అన్ని ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అరుణ్ పిళ్లైతో కవిత ముఖాముఖీ విచారణ జరగలేదని సమాచారం. కవిత, పిళ్లైని విడివిడిగానే విచారించినట్లు తెలుస్తోంది. విచారణ ముగిసిన తర్వాత బయటకొచ్చిన కవిత అభిమానులకు విజయచిహ్నం చూపిస్తూ , చిరునవ్వు చిందించారు. అభిమానులు ఆమెకు గుమ్మడికాయతో దిష్టి తీశారు. ఆ తర్వాత ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఇవాళ ఉదయం 11:30కి విచారణకు రావాలని కవితకు మరోసారి నోటీసులు ఇచ్చారు ఈడీ అధికారులు.
సోమవారం కవిత ఈడీ విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కవిత వెళ్లిన గంట తర్వాత కూడా ఈడీ బృందం ఏ ప్రశ్నలు అడగలేదని సమాచారం. కుట్ర పూరితంగానే తనను ఇరికించారని, తానూ ఎలాంటి తప్పు చేయలేదని, ఇది రాజకీయకుట్ర అని ఆమె ఈడీ అధికారులతో అన్నట్లు తెలుస్తోంది. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నా, రాజకీయ కారణాలతో వేధిస్తున్నారని ఈడీతో కవిత అన్నట్లు సమాచారం.