తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు.. ఐదో రోజున వారిని 7 గంటల పాటు విచారించారు. విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులు వెల్లడించిన వివరాల ఆధారంగా ఈ కేసులో సిట్ అధికారులు నిన్న (మార్చి 22న) మరో ముగ్గురిని అరెస్టు చేశారు. టీఎస్‌పీఎస్సీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 20 మంది వరకు ఉద్యోగులు గతేడాది నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రాశారు. వారిలో 8 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. సురేశ్, దామెర రమేష్ కుమార్, షమీమ్ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించారు. ఈ ముగ్గురూ లీకైన పరీక్షా పేపర్ల ద్వారానే మార్కులు తెచ్చుకున్నట్లు పోలీసులు అంచనాకు వచ్చారు. వీరిలో సురేశ్ అనే వ్యక్తి కేసులో ఏ 2 గా ఉన్న రాజశేఖర్ రెడ్డికి స్నేహితుడిగా పోలీసులు గుర్తించారు.
ఇక ఈ వ్యవహారంతో ఇప్పటికే గ్రూప్ -1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ (AE), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE), డివిజనల్ అకౌంటెంట్ ఆఫీసర్ (DAO) పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసింది. మార్చి 12న జరగాల్సిన టౌన్ ప్లానింగ్, మార్చి 15న జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలనూ కూడా వాయిదా వేసింది. రద్దైన పరీక్షలను త్వరలో నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో జరగాల్సిన మరో నాలుగు పరీక్షలు కూడా వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది.