AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఎకరానికి రూ.10వేలు ఇస్తాం : కెసిఆర్


అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్షాలు, వడగళ్ల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. కౌలు రైతులు అధైర్య పడొద్దని వారిని కూడా తమ ప్రభుత్వమే ఆదుకుంటుందని చెప్పారు. కేంద్రానికి నివేదిక పంపించబోమని అన్నారు. గతంలో చాలా సార్లు నివేదికలు పంపామని కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఖమ్మం జిల్లా బోనకల్‌ మండలం రావినూతలలో పర్యటించిన సీఎం కేసీఆర్.. వర్షం వల్ల నష్టం జరిగిన పంటలను పరిశీలించారు. గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించి.. రైతులతో మాట్లాడారు. పంట నష్టంపై ఆరా తీశారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు ? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు.

“అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. రైతులు నిరాశకు గురి కావొద్దు. కేంద్రానికి చెప్పినా.. గోడకు చెప్పినా ఒకటే. సమస్యలు ఉన్నాయని చెప్పినా.. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వదు. వ్యవసాయం దండగ అనే మూర్ఖులు ఉన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేల ఆర్థిక సాయం చేస్తాం. కౌలు రైతులను కూడా ప్రభుత్వమే ఆదుకుంటుంది. దేశంలో ఇప్పుడు డ్రామా జరుగుతోంది. దేశంలో రైతులకు లాభం చేకూర్చే పాలసీలు లేవు. మెుత్తం వ్యవసాయ పాలసీలను బీఆర్ఎస్ ఇస్తుంది.” అని సీఎం కేసీఆర్ వ్యాఖ్యనించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10