టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సిట్ విచారణ ముగిసింది. గంటపాటు రేవంత్‌ను సిట్ విచారించింది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Leakage)కి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను సిట్ అధికారులకు రేవంత్ అందజేశారు. విచారణ ముగిసిన అనంతరం టీపీసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడుతూ… ఆరు దశాబ్దాలు పోరాటం తరువాత తెలంగాణా సాధించుకున్నామన్నారు. తెలంగాణా ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది అమర వీరుల కుటుంబాలని తెలిపారు. 2009 మలి ఉద్యమం కూడా ఉద్యోగాల నియామాకాల పైనే జరిగిందని చెప్పారు. ప్రాణా త్యాగాలు చేసి తెలంగాణాను నిలబెట్టారని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు.
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక దేవాలయం, మసీదు, ప్రార్థనా మందిరం లాంటిదని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం నమ్మకం కలిగించాల్సిన బాధ్యత టీఎస్‌పీఎస్సీకి ఉందన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన అధికారులు వైఫల్యం చెందారని విమర్శించారు. టీఎస్‌పీఎస్సీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో అధికార పార్టీ నేతలు తల దూర్చారన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నా పత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై కేటీఆర్ బాధ్యత వహించాలని.. వెంటనే ఆయనను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్సీలో చైర్మన్ అలాగే వెంకట లక్ష్మీని జైలుకి పంపాలన్నారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.