పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. పోలవరం నీటి నిల్వపై ఇవాళ పార్లమెంటు సాక్షిగా ఈ ప్రకటన చేసింది. తొలిదశలో పోలవరం ప్రస్తుతానికి 41.15 మీటర్లకే పరిమితమని స్పష్టం చేసింది. తొలిదశలో 41.15 మీటర్ల మేరకే పోలవరంలో నీటిని నిల్వ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. తొలిదశ సహాయ, పునరావాసం అంతవరకేనని తేల్చి చెప్పింది. వైసీపీ ఎంపీ డాక్టర్ వెంకట సత్యవతి ఇవాళ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ సింగ్‌పటేల్ లిఖితపూర్వకంగా క్లారిటీ ఇచ్చారు.
పోలవరం తొలిదశ సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023కే పూర్తి కావాల్సి ఉందన్నారు ప్రహ్లాద్‌సింగ్‌పటేల్. తొలిదశలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు సహాయ, పునరావాసం ఫిబ్రవరి 2023 నాటికే ఇవ్వాల్సి ఉందని, దానిని కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదన్నారాయన. కేవలం 11,677 నిర్వాసిత కుటుంబాలకే సహాయ, పునరావాసం ఏపీ ప్రభుత్వం కల్పించినట్లు చెప్పారు. మిగతావారికి సహాయ, పునరావాసం మార్చి 2023 నాటికి పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇంతవరకు చేయలేదని ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేర్కొన్నారు.