హైదరాబాద్ సనత్ నగర్ లోని ఓ హోటల్లో 12 మంది అస్వస్థకు గురికావడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే సనత్ నగర్ లో ఉన్న మాషా అల్లా అనే హోటల్ కు బుధవారం రాత్రి కొంత మంది బిర్యానీ తినడానికి వెళ్లారు. అయితే మటన్ బిర్యానీ తిన్న 12 మంది అస్వస్థకు గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులుకు ఫిర్యాదు చేయగా జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ డాక్టర్ రేణుకలు గురువారం మధ్యాహ్నం సిబ్బందితో కలిసి హోటల్‌లో తనిఖీలు నిర్వహించారు. ఆ హోటల్ లో వండిన ఆహార పదార్థాలను పరిశీలించి, శాంపిళ్లను సేకరించారు.
ఈ సందర్భంగా బాధితుల ఫిర్యాదు మేరకు సనత్ నగర్ లో ఉన్న మాషాఅల్లా హోటల్ ను సీజ్ చేశామని అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల శాంపిళ్లను పరీక్షించిన తర్వాత ఏమైన లోపలున్నట్లు తేలితే హోటల్ నిర్వాహకులపై తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ పాయిజన్ కారణంగా ఆస్పత్రిలో చేరిన 12 మందిలో ఇప్పటి వరకు ఆరుగురు డిశ్చార్జి అయ్యారు. మరో ఆరుగురికి చికిత్స కొనసాగుతోంది.