కరీంనగర్ : మహిళల కోసం ఇప్పటికే పలు పథకాలను తీసుకువచ్చింది తెలంగాణ సర్కార్. తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “ఆరోగ్య మహిళ”. మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే 8 రకాల ఆరోగ్య సమస్యలకు వైద్యం అందించనున్నారు. ప్రతి మహిళా ఆరోగ్యంతో ఉండాలనేదే ఉద్దేశ్యం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోగ్య మహిళా పథకాన్నికరీంనగర్ జిల్లాలో బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామన్నారు. ఆరోగ్య మహిళ పథకంలో ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ పథకం కింద 100 దవాఖానాలు ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళా సిబ్బంది మాత్రమే ఉంటారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమ కోసం ఆరోగ్య లక్ష్మి, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వెల్లడించారు. మహిళల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా షీ టీమ్స్ ఏర్పాటు చేశామన్న మంత్రి హరీశ్ మిషన్ భగీరథ పథకం అమలు చేసి ఆడబిడ్డలకు నీటి కష్టాలు తీర్చామని తెలిపారు.