సిట్ నోటీసులపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. దొంగలను వదిలిపెట్టి ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడమేంటి? అని ప్రశ్నించారు. ఇవాళ తానే సిట్ అధికారులను పిలిచానని, తాను ఇంట్లో లేని సమయం చూసి సిట్ వాళ్లు తమ ఇంటికొచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ కార్యక్రమంలో బండి సంజయ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘యువకులు కష్టపడి కోచింగ్ తీసుకుంటే వారి భవిష్యత్‌ను పేపర్ లీకేజీ వల్ల అంధకారంలో నెట్టారు. మంత్రి కేటీఆర్ దీనికి బాధ్యత వహించి ముందు రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రభుత్వానికి భయమెంటో చూపిస్తాం. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. నిరుద్యోగులు అధైర్యపడొద్దు. టీఎస్‌పీఎస్సీలో అసలు దొంగలను అరెస్ట్ చేయాలి’ అని అన్నారు.
జైళ్లు, కేసులు మాకు కొత్తేమి కాదని, బీజేపీ భయపడే పార్టీ కాదని బండి సంజయ్ తెలిపారు. అటు బీజేపీ నాయకురాలు విజయశాంతి మాట్లాడుతూ.. పేపర్ లీకేజీ పేరుతో వ్యాపారం జరుగుతోందని, తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమం మొదలైందన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని, నిరుద్యోగులు మౌనం వీడి పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.