భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌కు మద్దతుగా అవసరమైతే తమ ఎంపీ పదవులను వదులుకుంటామని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎంపీలు పదవులు వదులుకోవడానికి సిద్దంగా ఉన్నారని, సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే ఆదేశిస్తే రాజీనామాలు చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, రాహుల్ గాంధీ రెండుసార్లు ప్రధాని అయ్యే ఛాన్స్ వదులుకున్నారని వెంకటరెడ్డి గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారని వెంకటరెడ్డి అన్నారు. ఇందిరాగాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించిన పార్టీ నామరూపాలు లేకుండా పోయిందని, రాహుల్ గాంధీని బహిష్కరించిన పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుందని విమర్శించారు. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యస్పూర్తికి వ్యతిరేకంగా రాహుల్‌పై అనర్హత వేటు వేశారని, పదే పదే తనకు కుటుంబం లేదని చెప్పి దేశ ప్రజలను మోదీ నమ్మిస్తున్నారని ఆరోపించారు.