ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటుకు నిరసనగా ఆదివారం గాంధీ భవన్‌లో ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తన మిత్రుల కోసం ప్రధాని మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఫిబ్రవరి 7న బీజేపీ ప్రభుత్వాన్ని నిండు సభలో ఆదానీ కుంభకోణంపై ప్రశ్నించారని.. దీంతో ప్రధాని ఉక్కిరి బిక్కిరై సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
బీజేపీ డబుల్ ఇంజన్ అనే ఆదానీ-ప్రధాని.. రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేక ఆయనపై కుట్ర చేసి.. అనర్హత వేటు వేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన చరిత్ర కాంగ్రెస్‌దని అన్నారు. హడావుడిగా రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అనర్హుడిగా ప్రకటించిందన్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు దీక్ష విరమణ జరుగుతుందని, తరువాత తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.