నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన సీనియర్ నేత డి. శ్రీనివాస్(D Srinivas).. నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ పంపారు. ఆయన భార్య విజయలక్ష్మి కూడా ఇందుకు సంబంధించి మరో లేఖను విడుదల చేశారు. తన కుమారుడు సంజయ్‌కు ఆశీస్సులు అందించేందుకే తాను గాంధీభవన్‌కు వచ్చానని అన్నారు. తాను కాంగ్రెస్ (Congress) వాదినని చెప్పుకొచ్చారు. ఒకవేళ తాను కాంగ్రెస్‌లో చేరినట్టు భావిస్తే.. ఇది తన రాజీనామా లేఖగా భావించాలని కోరారు. వయస్సు, ఆరోగ్యం కారణంగా తాను క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని డీఎస్ అన్నారు. తనను అనవసరంగా వివాదాల్లోకి లాగొద్దని పేర్కొన్నారు.
అయితే డీఎస్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నట్టు లేఖ బయటకు రావడంపై ఆయన పెద్ద కుమారుడు సంజయ్ తప్పుబట్టారు. ఆయనతో బలవంతంగా లేఖపై సంతకం చేయించారని ఆరోపించారు. ఇదంతా బీజేపీ కుట్ర అని ఆరోపించారు. తన సోదరుడు, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తీరును పరోక్షంగా తప్పుబట్టారు. తన తండ్రి ఆరోగ్యం కాస్త కుదుటపడితే.. నిజామాబాద్‌కు తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని అనుకున్నానని.. కానీ ఈలోపు తన సోదరుడు ఈ విధంగా చేస్తాడని అనుకోలేదని సంజయ్ ఆరోపించారు.